“అమ్మా, మేం విడాకులు తీసుకోవాలనుకుంటుంన్నాం” దిగాలుగా చెప్పింది సునీత.
ఆ మాట విని ఉలిక్కిపడిన వాళ్ళ అమ్మ, గబగబా తనని ప్రక్క గదిలోనికి తీసుకెళ్లి అంతా ఆరాతీసింది. అయితే, తన నిర్ణయంలో మార్పు లేదని బల్ల గుద్దినట్టుగా చెప్పింది సునీత. ఎంచేయాలో తెలీక కన్నీరు పెడుతూ, “అలా చేయకూడదమ్మా” అని కూతురును బ్రతిమిలాడటం మొదలుపెట్టింది.
విషయం కాస్త నాన్న వరకూ వెళ్ళింది. నాన్న గారు ఆవేశపూరితుడై “అంత పని చేస్తావా?!” అని గట్టిగా అరిచాడు.
ఈ తతంగమంతా గమనిస్తున్న అనుభవజ్ఞుడైన తాతయ్య గారు నెమ్మదిగా వచ్చి “అమ్మా, మంచి నిర్ణయం తీసుకున్నావు. నచ్చిన వారితోనే ఉండగలం, లేదంటే విడాకులే సరి” అని అన్నాడు. తాతయ్య మాటకు అందరు ఆశ్చర్యపోయారు.
ఈలోగా బుర్రుమని రెండు చక్రాల బండిపైన వచ్చారు పాస్టర్ అంకుల్. “అమ్మా, దైవసేవకునిగా చెబుతున్నాను, అలా చేయడం సబబు కాదు” అన్నాడు.
ఇక, “యువర్ లైఫ్ యువర్ విష్ సునీత, నీకు నచ్చింది చేసేయ్” అని అదేపనిగ స్నేహితుల సలహాలు.
ప్రియ విశ్వాసి, పై సంభాషణ గమనించావా? సమస్య విడాకులు కాదు. సమస్య “అధికారం.”
సునీత ఎవరికి లోబడాలి? ఆమెపైన సరైన అధికారి ఎవరు? ఎవరు తనని నడిపించాలి? అమ్మా? నాన్నా? తాతయ్యా? పాస్టర్ గారా? లేక స్నేహితులా? అసలెందుకు వీరి మాట వినాలి? అమ్మ దుఖిస్తూ బ్రతిమిలాడుతున్నందుకా; నాన్న పరువు ప్రతిష్టల కోసం గద్దిస్తున్నందుకా; తాతయ్య అనుభవజ్ఞుడు కాబట్టా; పాస్టర్ అంకుల్ దైవసేవకుడు కాబట్టా; లేక స్నేహితులది కొత్త ట్రెండ్ కాబట్టా? ఎందుకు వీరికి లోబడాలి?
ఫలితంగా, సునీత జీవితంలోని ఒక కీలకమైన నిర్ణయం అలా గాలిలో వ్రేలాడుతుంది.
విశ్వాసి యొక్క వ్యక్తిగత విషయాలు అలా ఉంచితే, సంఘము యొక్క స్థితి కూడా దయనీయంగా మారిపోయింది. సంఘములో ఎవరు అధికారి? సంఘాన్ని ఎవరు నడిపించాలి? ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఉచిత సలహాలకైతే అసలు కొదువేలేదు! నొక్కి వక్కానించేవాళ్ళు కొందరైతే, మెల్లనైన స్వరంతో కొందరు. దాదాగిరులు కొందరైతే, దయారసంతో కొందరు. ఇలా ఎవరికివారు తమదైన శైలిలో సంఘములో తమ తమ స్వంత కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఎవరి మాట నెగ్గాలి? సంఘం ఎవరికి లోబడాలి? ఎవరు అధికారి?
బైబిలే మన ప్రధానమైన అధికారి. అది వ్యక్తిగత వ్యవహారమైనా, సంఘ విషయమైనా, బైబిల్ చెప్పిందే నడవాలి. విశ్వాసినైనా, సంఘాన్నైనా వాక్యమే నడిపించాలి. ఎందుకంటే, బైబిల్ దేవుని మాట. దాంట్లో యేసు క్రీస్తు ప్రభువు చేసిన సూచనలు ఉంటాయి. పరిశుద్ధాత్ముని దివ్యమైన పలుకులు ఉంటాయి. మనుష్యుని మాటలు ఉండవు. దాంట్లో మనిషి ప్రమేయమేమి లేదు. “ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి” (2 పేతురు 2:21). మనకు కావలిసినవన్నీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేసాడు. మన జీవితానికి, సంఘ క్షేమానికి సరిపడ మాటలన్నీ మన కొరకు బైబిల్ లో భద్రపరిచాడు. బైబిల్ పూర్తిగ దేవుడు వ్రాసిన గ్రంథం.
దేవుడు వ్రాస్తే ఏంటి…? అదే బైబిల్ యొక్క ఘనత. దేవుడు వ్రాస్తే దాంట్లో పొరపాట్లు ఉండవు. “దొంగిల్లకూడదు” అని దేవుని వాక్యం చెప్తే, ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ పరిస్థితైనా అది సరిగ్గా వర్థిస్తుంది. మనుష్యుల అభిప్రాయాలు, ఆలోచనలు, సలహాలు కాలానుగుణంగా మారుతాయి. మనిషి పొరపాటు చేయడం సహజం. కాని దేవుని మాట శాశ్వత కాలము సత్యమే. “యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు” (కీర్తనలు 12:6). ఆయన వాక్యమే సత్యము (యోహాను 17:17), గనుక ఆయన వాక్యమే మనకు సరైన అధికారి. ప్రతికూలమైనా అనుకూలమైనా, దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వడం మనకు మేలు.
ఈ రెండింటిని నీవు గ్రహించడం చాలా కీలకం: 1. బైబిల్ దేవుని వాక్యం గనుక పొరపాట్లు ఉండవు. 2. పొరపాట్లు ఉండవు కాబట్టి అదే మనలను సరిగ్గా నడిపిస్తుంది. అదొక్కటే పొరపాట్లు చేయలేని అధికారి. తల్లి, తండ్రి, తాతయ్య, పాస్టర్ గారు, స్నేహితులు..., వారి స్థానం వారికి ఉంది. వారిని దేవుడే మనకిచ్చాడు. కాని బైబిల్ తరువాతే ఎవరైనా. సంఘము నిర్వీర్యం అవ్వడానికి కారణం వాక్య లేమి అని తెలుసుకున్న దైవ సేవకులు “లేఖనం మాత్రమే” అంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. కాబట్టే, ఈ రోజు సంఘం ఇలా నిలబడగలిగింది. మల్లీ వాక్యాన్ని వదిలి వ్యర్ధమైన వాటివైపుకు మనం తిరుగకూడదు.
ప్రియ చదువరి! దేవుని వాక్యానికి నీవిస్తున్న విలువ ఎంత? నీ జీవితాన్ని పూర్తిగా వాక్యానికి అప్పగించడం అత్యవసరం. నీ వస్త్రధారణ, నీ మాటతీరు, నీ అలవాట్లు, నీ ప్రవర్తన, నీ జీవిత ఆశయాలు అన్నీ వాక్యానుసారంగా మారడం శ్రేయస్కరం. బైబిల్ నీకు చేసే మేలు ఈ భూమి మీద మరేది చేయలేదనడంలో సందేహం లేదు.
జాగ్రత్త! బెదిరింపుకో, బుజ్జగింపుకో తలవంచకు. అనుభవజ్ఞునికో, ఆతురతకో మొగ్గుచూపకు.
బైబిల్ చేతపట్టు! నీ జీవితానికి సరైన దిక్సూచి అదే.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.