ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటించాలి. “నీ ద్వారా ఎవరూ రక్షింపబడట్లేదు అంటే బహుశ నీవే రక్షింపబడలేదేమో” అని అన్నాడు ఒక దైవజనుడు. అవును, యేసు క్రీస్తును కనుగొన్నవాడు ఇంకొకరికి ఆయనను పరిచయం చేయకుండా ఉండలేడు. ఈ పని మనం విరివిగా చేయాలని ప్రభువు మనలను పిలుస్తున్నాడు. ప్రియ చదువరి, నీవు యేసును ప్రకటించట్లేదా? సువార్తీకరణ సరిగా జరగట్లేదా? అయితే ప్రభువు వేస్తున్న మూడు ప్రశ్నలివి:
ఈ లోకంలో మనము ఉప్పు వలె ఉన్నాము. ఉప్పు, కూరంతటికి మంచి రుచిని ఇస్తుంది. ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే దేవుని రుచి తెలియని స్థితిలో ఈ లోకం ఉంది. అన్నీ ఉన్నా ఉప్పు లేని కూర తెచ్చి పెడితే రుచే లేదని నీవన్నట్టు, దేవుడిచ్చే గాలి నీరు అన్నీ అనుభవిస్తున్నా, దేవుడే లేడంటారు వీళ్ళు! అందుకే, దేవుని సారము (దేవుని రుచి) ఇవ్వడానికి దేవుడు మనలను ఉప్పు వేసినట్టుగా ఈ లోకంలో వేసాడు. మనము మన మాటలో, ప్రవర్తనలో యేసు క్రీస్తును చాటుతూ దేవుని రుచిని పంచాలి.
అయితే ఆలోచించు, రుచిని ఇవ్వాల్సిన ఉప్పే రుచిని ఇవ్వకపోతే? వేరే ఏ పదార్థమైనా ఆ రుచిని తీసుకురాగలదా? అసాధ్యం! కూరలో ఉప్పు లేదని పసుపు, కారం, నూనె, నీళ్ళు, ఏది చల్లినా రుచి రాదు. ప్రభువు అదే ప్రశ్నిస్తున్నాడు. ఉప్పు నిస్సారమైతే, దేని వలన సారం కలుగుతుంది? (మత్త 5:13). ‘వ్యర్థుడా’ అని అనకూడని నీవే ఆ చెడు మాట పలికితే? మోహపు చూపు చూడకూడని నీవే చెడు చూపు చూస్తే? శత్రువును ప్రేమించాల్సిన నీవే ద్వేషిస్తే? క్రీస్తును ప్రకటించాల్సిన నీవే వేరే ముచ్చట్లకు తిరిగితే? ఈ ఉప్పే నిస్సారమైపోతే, ఇంక దేవుని రుచి ఈ లోకంలో కలిగే అవకాశం ఉందా?
అలాంటి ఉప్పు దేనికీ పనికిరాదని దాన్ని బయట పడవేస్తారు (మత్త 5:13). క్రీస్తుకు సాక్షిగా నీవు జీవించలేకపోతే, దేవుని రుచి ఈ లోకంలో ఉండకుండా అవ్వడం మాత్రమే కాదు, నీవు దేనికీ పనికిరాని వానిగా ఉంటున్నావు.
సువార్తీకరణకు పిలుపునిస్తూ ప్రభువు వేస్తున్న రెండవ ప్రశ్న ఇది. ఈ లోకం చిక్కని చీకటిలో మునిగిపోయింది (నిర్గమ 10:21). దేవుని జ్ఞానం లేక మనుష్యులు గాఢాంధకారంలో తడవులాడుతున్నారు. క్రీస్తు మహిమను చూడలేని పరిస్థితి వీరిది (2 కొరింథీ 4:4). ముసుకు వారి హృదయముల మీద ఉంది గాని ‘వారి హృదయం ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును’ (2 కొరింథీ 3:16). అందుకే దేవుడు మనలను యేసు క్రీస్తు ద్వారా వెలిగించి, ఈ లోకంలో వెలుగుగా ఉంచాడు (ఎఫెసీ 5:8). జీవవాక్యము చేతపట్టుకొని జ్యోతులవలె కనబడుతున్నాము (ఫిలిప్పీ 2:16).
అయితే ఆలోచించు, వెలిగింపబడ్డ నీవు ఆ వెలుగును దాచుకుంటే? కొంత వెలుతురైనా బయటకు రాకుండ దాన్ని పూర్తిగా కప్పిపెడితే? చీకటిని పోగొట్టగలమా?
ప్రభువు అదే ప్రశ్నిస్తున్నాడు. దీపం వెలిగించి కుంచము (గంప) క్రింద పెడతామా? (మత్త 5:15). ఉపయోగం ఉంటుందా? అది బుద్ధిహీనత కదా? దీపాన్ని కప్పిపెట్టకూడదు. అది అందరికి వెలుతురునివ్వాలి. క్రీస్తును కనుపరచాల్సిన నీవే ఎవరికి కనబడకుండా ఉంటే? క్రీస్తును గూర్చి మాట్లాడవలసిన నీవే మూగబోతే? ఈ దీపమే దాని వెలుగు దాచుకుంటే, ఇంక ఈ లోకంలో దేవుని వెలుగు కలిగే అవకాశముందా?
నీవు ఈ లోకంలో వెలుగుగా ఉంచబడ్డావనే గ్రహింపు నీకు రావాలి. అయ్యో నేను ఈ వెలుగును దాచకుండా కొంతైనా పంచాలి కదా అనే ఆసక్తి ప్రభువు నీకు కలిగించును గాక!
ప్రభువు వేస్తున్న మూడవ ప్రశ్న ఇది. కొండ మీద ఉన్న పట్టణము అందరికి కనిపించేలా ఉంటుంది. అలాగే దేవుడు మనలను యేసు రక్తంలో కడిగి, క్రీస్తు ద్వారా మనలను మలచి, క్రొత్తగా తయారుచేసి, కొండ మీద నిలబెట్టినట్టుగా నిలబెట్టాడు. దాన్ని గోప్యంగా ఉంచగలమా? అది మరుగైయుండనేరదని ప్రభువు అంటున్నాడు (మత్త 5:14). కొండ మీద ఉండే పట్టణమును మరుగుపరచలేము. కొండ లోయలా అయిపోదు, లేదా అడవి పెరిగి కొండను ముంచలేదు. ఆ పట్టణం అందరికి కనిపించేదిగా ఉంటుంది.
ఈ మాటలన్నీ చెప్పి ప్రభువు వారితో, కాబట్టి ‘మీ వెలుగును ప్రకాశింపనీయుడి’ అని ఆజ్ఞాపించాడు (మత్త 5:16). ‘దీని గూర్చి ప్రార్థించండి, లేదా దీన్ని గమనించండి’ అని సలహా ఇవ్వలేదు. ‘మీ వెలుగును ప్రకాశింపనీయుడి’ అని ఆజ్ఞాపించాడాయన. ఈ రోజు నీవు, నేను ఇదే ఆజ్ఞకు లోబడుతూ సమయమందు-అసమయమందు, అందరి యెదుట మన వెలుగును ప్రకాశంపనివ్వాలి. తత్ఫలితంగా వారు పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తారు (మత్త 5:16). వారు నిజంగా ఆయనను మహిమపరిచారు అంటే రక్షింపబడ్డారని అర్థం. క్రీస్తు వెలుగు ప్రకాశింపబడడం ద్వారా కలిగే ఫలం ‘దేవుని మహిమ.’
నీ సహోదరుడు దేవున్ని మహిమపరచాలనే ఆశ నీలో ఉందా? నీ బంధువులు దేవున్ని మహిమపరచాలనే ఆశ నీలో ఉందా? నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు దేవున్ని మహిమపరచాలనే ఆశ నీలో ఉందా? అయితే వారియెదుట నీ వెలుగు ప్రకాశించనియ్యాలి. ఆలోచించు, ఉప్పు నిస్సారమైపోతే ఎలా?
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.