మరణం అందరినీ భయపెడుతుంది. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం చావుకు భయపడుతూ బ్రతకాల్సిందే. ఎంతటివారైనా, ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. అసలేంటి ఈ పరిస్థితి? మనమెందుకు చనిపోతున్నాము? పాపానికి జీతం మరణం అని బైబిల్ చెబుతుంది. పాపం చేసావా? అయితే దానికి జీతంగా మరణాన్ని పుచ్చుకోవాలి. మీరు మరణము కాకుండా మీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే మరణం. చిరకాలం మరణపు కోరల్లో శిక్ష అనుభవించడం.
పాపమంటే, ఏదో కేవలం దొంగతనం చేయడం, లేకపోతే వ్యభిచారం చేయడం, ఇలాంటివే అనుకోకండి. చిన్న అబద్ధమైనా, చెడు ఆలోచన అయినా, తప్పుడు చూపు అయినా, దేవుని దృష్టిలో పాపమే. దేవుడు అంత పరిశుద్ధుడు, తప్పును తప్పుగా పరిగణించి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష మరణం. ఇంకొక చోట, "మరణపు ముల్లు - పాపము" అని వ్రాయబడియున్నది. మరణం నిన్ను కాటు వేయాలి అంటే ఉపయోగించుకునే ముల్లు ఏంటి అంటే పాపము. పాపము తప్పకుండా మరణాన్ని తీసుకొని వస్తుందని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది.
మరి మరణాన్ని తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా? చావంటే భయము లేకుండా బ్రతుకగలమా? అవును, బ్రతుకగలము. ఇంతవరకూ మనం చూసినట్లు, మరణానికి కారణం పాపమే కాబట్టి, నీ పాపము పోతే నీకు ఇక మరణము ఉండదు. దాదాపు రెండువేల సంవత్సరాల క్రితము, మానవాళి మనుగడను మార్చివేసే ఒక మహత్తరమైన సంఘటన జరిగింది. దైవ తనయుడు యేసుక్రీస్తు ప్రభువు, ఈ భూమి మీదకి వచ్చి, నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తము చేసాడు. ఏ పాపము లేని ఆయన, సిలువ పైన వ్రేలాడుతూ, నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన రక్తము, ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. నీ పాపాన్ని క్షమించే అధికారం ఆయనకే ఉంది. ఆయనయందు విశ్వాసం ఉంచితే చనిపోయినవాడు కూడా బ్రతుకుతాడు. నిత్యజీవము పొంది, దేవునితో పరలోకంలో యుగాయుగాలు సంతోషంగా గడుపుతాడు.
నీవు చేయవలసినది ఒక్కటే. "దేవా, నా పాపము మన్నించు" అని ప్రార్థించాలి. యేసు క్రీస్తు నీ పాపముల కోసం మరణించాడని విశ్వసించి, క్షమాపణ పొంది, ఆయనను వెంబడించు. ఇంకొక దారి లేదు. యేసుక్రీస్తు చేసిన ఈ సిలువ యాగమే మనకు ఏకైక దిక్కు.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.