పరిశుద్ధులు దేవునితో సహవాసం కలిగి ఉంటారని, ఆయనకు మనకు మధ్య జరిగే పరిశుద్ధ క్రియల వలన ఈ సహవాసం ఉంటుంది అని గడిచిన వారములలో మనం చూసాము. అయితే, ఈ శీర్షికలో విశ్వాసులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో విభిన్నమైన మరియు ప్రత్యేకమైన సహవాసం కలిగి ఉంటారని స్పష్టం చేయాల్సి ఉంది. త్రియేక దేవునిలోని ఒక్కొక్కరితో వేరు వేరుగా మనం సహవాసం కలిగి ఉన్నాము.
1 యోహాను 1:7 లో “సాక్ష్యమిచ్చువారు ముగ్గురు” అని వ్రాయబడింది. (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ). వారు ఇచ్చే సాక్ష్యమేంటి? క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన రక్తము వలన విశ్వాసులకు రక్షణ అని వారు ఇచ్చే సాక్ష్యం. మనం మనుష్యుల సాక్ష్యం అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుడు మన రక్షణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు, ఆయన సాక్ష్యాన్ని మనం అంగీకరించాలి. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరుగా సాక్ష్యమిస్తారు, ఎందుకంటే వారు ముగ్గురు వేర్వేరు సాక్షులు. కాబట్టి మనము కూడ అలానే వేరు వేరుగా వారి సాక్ష్యాన్ని స్వీకరించాలి. అలా చేయడం ద్వారా, మనము వారిలో ఒక్కొక్కరితో విభిన్నమైన, ప్రత్యేకమైన సహవాసం కలిగి ఉంటాము.
1 కొరింథీ 12:4-6 లో కృపావరములు పంచుటను ముగ్గురికీ ఆపాదించాడు పౌలు. “కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే (పరిశుద్ధాత్మ), మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే (యేసు క్రీస్తు ప్రభువు), నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే (తండ్రియైన దేవుడు).” ఇలా, కృపావరములు పంచుటలో ముగ్గురి పాత్ర విభిన్నమైనది గనుక మనం కూడ వాటిని అలానే స్వీకరిస్తాము.
దేవుడు మనకిచ్చేవి మనం విభిన్నంగా (ముగ్గురి నుండి) పొందడం మాత్రమే కాకుండ, మనము దేవుని యొద్దకు చేరుట కూడ విభిన్నంగా (ముగ్గురి ద్వారా) జరిగే ప్రక్రియ. “క్రీస్తు ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.” (ఎఫెసీ 2:18). దేవుని యొద్దకు చేరుటలో మనము “dia Christou,” “క్రీస్తు ద్వారా,” “en Pneumati,” “ఆత్మయందు,” “pros ton Patera,” “తండ్రిసన్నిధికి” చేరుతున్నాము.
దేవుడు నియమించిన పరిశుద్ధమైన క్రియలను మరియు ఆరాధనను చేయుట ద్వారా పరిశుద్ధులు దేవుని సన్నిధికి చేరుతారు. విశ్వాసం, ప్రేమ, నమ్మిక, ఆనందం మొదలైన కృపలు (క్రియలు) దేవుడు నియమించిన ఆరాధనలో భాగం. వీటి ద్వారా పరిశుద్ధులు దేవునితో సహవాసం పొందుతారు. అయితే, ఈ క్రియలు మనము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తో (వేరు వేరుగా) జరిగిస్తామని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి.
1. తండ్రిని గూర్చి: పరిశుద్ధులు తండ్రిపట్ల విభిన్నమైన మరియు ప్రత్యేకమైన విశ్వాసం, ప్రేమ, విధేయత మొదలైనవి కలిగి ఉంటారు. ఆయన తనను తాను వారికి ప్రత్యేకంగా బయలుపరచుకుంటాడు. ఆయన తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తాడు. “దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.” (1 యోహాను 5:8). ఈ సాక్ష్యం ఆధారంగా మనము ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా స్వీకరిస్తాము. కాబట్టి, ఇలా మనము తండ్రి ఇచ్చే సాక్ష్యాన్ని నమ్ముతున్నాము గనుక తండ్రిపైన ప్రత్యేకమైన విశ్వాసాన్ని కనుపరస్తున్నాము. సాధారణంగా మన విశ్వాసము త్రియేక దేవుని పైన కలిగి ఉంటాము. కాని, ఈ సందర్భములో తండ్రి పైన ప్రత్యేకమైన విభిన్నమైన విశ్వాసాన్ని కనుపరస్తున్నాము.
అలాగే, తండ్రిని ప్రత్యేకంగా ప్రేమించట. “ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.” (1 యోహాను 2:15). ఇక్కడ ‘తండ్రి ప్రేమ’ అంటే మనము తండ్రిని ప్రేమించట అని అర్థం. ‘ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుండ’ మనము తండ్రిని ప్రేమిస్తున్నాము. దీన్నే మలాకి 1:6 లో తండ్రికి ఇచ్చే “ఘనత” అని పేర్కొన్నారు.
అలాగే, తండ్రిని ప్రార్థించుట, స్తుతియించుట. “తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు” (1 పేతురు 1:17). ఎఫెసీ 3:14 లో “ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని…” మోకరించుట తండ్రిని ఆరాధించుటయే. ఇక్కడ పౌలు తండ్రిని ప్రార్థించుటను సూచిస్తూ ఆ పదం వాడుతున్నాడు. క్రీస్తు వలన మనకు కలుగుతున్న మేలులన్నీటికి తండ్రి మూలం, ఎందుకంటే ఆయన “మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి”. ఇలా, పరిశుద్ధులు దేవునితో సహవాసం కలిగి ఉంటారు మరియు విభిన్నంగా తండ్రితో కలిగి ఉంటారు.
2. కుమారుని గూర్చి: మీరు “దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి,” అని ప్రభువు అన్నాడు. (యోహాను 14:1). “నాయందును” అంటే ప్రభువు పైన ప్రత్యేకంగా మనం విశ్వాసం ఉంచాలి అని అర్థం. తండ్రిపైన విశ్వాసంతో క్రీస్తును స్వీకరించడం (విశ్వసించడం) మాత్రమే కాకుండ, దేవుని కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తుపై మన విశ్వాసం, ధైర్యం, నిబద్ధత ప్రత్యేకంగా ఉంచాలి. ఇదే “దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచుట.” (1 యోహాను 5:12). “దేవుడు (తండ్రి) లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు (కుమారుని యందు) విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16). తండ్రి అనుగ్రహించిన కుమారుడు విశ్వసించబడాలి. 18వ వచనం, “ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు”. 36వ వచనం, “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు”. “యేసు యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ…” (యోహాను 6:29). ఈ సత్యమంతటికి ఆధారం యోహాను 5:23 లో చూస్తాము: “తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని - సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.”
అలాగే, కుమారుని ప్రేమించుట. దీన్ని సూచిస్తూ ఎన్నో వచనాలు ఉన్నాయి కాని ఒక్క వచనం చూద్దాం. ఎఫెసీ 6:24 లో అపోస్తలుడు ఇచ్చిన ఆశీర్వాదం: “మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక”. అనగా ‘దైవిక ప్రేమతో’ లేదా ‘భక్తిపూర్వకమైన ప్రేమతో’ అని అర్థం. ప్రభువుకు తగిన ప్రేమ ఇదే.
అలాగే, కుమారుని ఆరాధించుట. ప్రకటన 1:6 లో పరిశుద్ధులు ప్రత్యేకమైన విశ్వాసం, ప్రేమ, నిరీక్షణలతో కుమారుని ఆరాధిస్తారని స్పష్టంగా చూడవచ్చు. “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగానుజేసెను.” ప్రకటన 5:8 లో ఇంకా స్పష్టంగా, “ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి.” మరియు 13,14 వచనాల్లో, “అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.” ఇక్కడ తండ్రి మరియు కుమారుడు (సింహాసనంపై కూర్చున్నవాడు మరియు గొర్రెపిల్ల) ఉమ్మడిగా, అదే సమయంలో వేర్వేరుగా, సమస్త ఆరాధనకు మరియు ఘనతకు ఎల్లకాలం తగిన వారని చూపించబడుతున్నారు.
3. పరిశుద్ధాత్మను గూర్చి: పైవన్నీ ఉన్నప్పటికీ, క్షమించలేని పాపముగా పరిగణించబడే అవిశ్వాసము పరిశుద్ధాత్మను నిరాకరిచుట లేదా ఎదిరించుటయే అని తెలియజేయబడింది. అలాగే, పరిశుద్ధాత్మ ప్రేమను గూర్చి రోమా 15:32 లో మరియు పరిశుద్ధాత్మను ప్రార్థించుటను గూర్చి అపోస్తలులు ఇచ్చే ఆశీర్వాదంలో మనం చూడవచ్చు. “ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.” (1 కొరింథీ 13:14). ఈ ఆశీర్వాదాలు వాస్తవానికి ప్రార్థనలు. అలాగే, పరిశుద్ధాత్ముడు కూడా నియమింపబడిన సమస్త ఆరాధనకు అర్హుడు. దీని గురించి మరింత తరువాత చెబుతాను.
ఇలా, మనము వివిధరకాలైన కృపల ద్వారా (విశ్వాసం, ప్రేమ, ప్రార్థన, ఆరాధన…) దేవునితో సహవాసం కలిగి యున్నాము. అయితే, ఈ సహవాసం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతో విభిన్నంగా మరియు ప్రత్యేకంగా కలిగి యున్నము. దీనికి వేరుగా ఉండే విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, విధేయత లేదు.
[ఈ వ్యాసము John Owen గారు రచించిన “దేవునితో సహవాసము” (Communion with God) అనే విలువైన పుస్తకములోనుండి సంగ్రహించబడినది. తరువాయి భాగము వచ్చేవారం ప్రచురణ చేయబడుతుంది. ప్రార్థించగలరు].
John Owen (1616 – 1683) is a renowned puritan pastor and theologian. He also worked as Vice-Chancellor at the University of Oxford. He authored many books including Communion with God.