logo
logo

క్రీస్తు మహిమను ధ్యానించుట

క్రీస్తు యొక్క మహిమను ధ్యానించడమే నీ విశ్వాసానికి, ఆనందానికి మరియు ఆరాధనకు మూలం.

  • Article by John Owen (1616 – 1683)
    December 8, 2021
  • మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను ధ్యానించడం నీకు అలవాటు అయిపోవాలి. అది నీవు తరచుగ చేసే పని అవ్వాలి. ఎందుకంటే, నీ విశ్వాసానికి, ప్రేమకు, ఆనందానికి మరియు ఆరాధనకు మూలం అదే. యేసు క్రీస్తు యొక్క మహిమను దేవుడు లేఖనాల్లో మన కొరకు భద్రపరచి, దాన్ని మనం ధ్యానించాలి అని సూచించాడు. ఈ శీర్షికలో, క్రీస్తు మహిమను ధ్యానించడం మన దిన దిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

    శోధనలు, శ్రమలు, దుఃఖములు, అపాయములు, భయములు, వ్యాధులు, మొదలగునవి మన జీవితాన్ని ఆక్రమించుకునే భాగము ఇంతా అంతా కాదు. కొందరు ప్రతిదినము లేమి మరియు పేదరికంతో యాతనపడుతుంటే, మరికొందరికి వ్యాధి బాధలు లేని గంటలు కొన్నే. క్రైస్తవులకైనా, క్రైస్తవేతరులకైనా, మనిషి జీవితంలోని ఈ కష్టాలు భారంగానే ఉంటాయి.

    అపోస్తలుడైన పౌలు కూడ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ చెప్పిన మాటలు ఒక్క సారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇలా అన్నాడు:

    “ఎటుబోయినను శ్రమపడుచన్నను ఇరికింపబడినవారము కాము; అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.” ఎల్లప్పుడు బాధింపబడుచున్నాము, అయితే “మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము ‘గనుక’ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు.” (2 కొరింథీ 4:7-18).

    ప్రియ చదువరి, ఆయనేమంటుంన్నాడో గ్రహించావా?

    కనిపించని నిత్యమైన ఆత్మీయ సంగతులను విశ్వాసపు నేత్రాలతో మనము చూడగలిగితే, ఈ లోకపు శ్రమలు కనుమరుగవుతాయి. మనం పైనున్న వాటిపైనే దృష్టి ఉంచితే ఈ శ్రమల భారము తేలికవుతుంది. మన ఆత్మలు వాటి క్రింద నలిగిపోకుండా కాపాడబడతాయి.

    అయితే, ఆ నిత్యమైన ఆత్మీయ సంగతుల్లో ప్రధానమైనది క్రీస్తు మహిమయే. ఆ క్రీస్తు మహిమే అన్నీటి సమకూర్పు. ఎందుకంటే, యేసు క్రీస్తులో దేవుని మహిమ ప్రకాశించబడుతుంది. ఈ మహిమను అన్ని సమయాల్లో ధ్యానించగలిగేవాడు ప్రస్తుత కాలపు దుష్ట ఆందోళనలను అధిగమించగలుగుతాడు.

    విచారకరమైన సంగతేంటంటే, మనుష్యులు తాము కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తాత్కాలికమైన ఆదరణలవెంట పరుగిడుతుంటారు. కాని మన వ్యాధులన్నీటికి మందు ఇదొక్కటే. శ్రమ, దుఃఖము, వేదన, భయము ఏదైన మనము క్రీస్తు మహిమను నిదానించి చూచి, ధ్యానించగలిగితే, గొప్ప ఆదరణ, బలము మనకు చేకూరుతుంది. అయితే, “దుష్టులు తమ శ్రమలలో ‘కదులుచున్న సముద్రమును’ పోలి ఉంటారు. దానికి నెమ్మది ఉండదు” (యెషయా 57:20). కొందరైతే గుండె చెదరి కృంగిపోతారు. మనలో బలమైనవారు సహితం, ఇలాంటి శ్రమలు అనుకోని రీతిలో వచ్చినా లేదా ఎక్కువ కాలం బాధించినా, తప్పకుండ నీరసించి కూలిపోతారు. అలాంటి వారు ఈ బలమైన దుర్గమును ఆశ్రయించాలి. క్రీస్తు మహిమను నిదానించి చూడడంలో వారి ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది.

    క్రీస్తు మహిమను మనము ధ్యానిస్తున్నప్పుడు, మనకు కలిగే శ్రమ బాధలు ఎంత స్వల్పమైనవో తేటపడుతాయి. ఎందుకంటే, ఈ శ్రమలన్నీ “అస్ధిరమైనవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం” అనే వేరులోనుండి పెరుగుతాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ నశించిపోయేవని, మన శరీరాన్ని మాత్రమే చేరగలవని, అత్యంత నష్టం కలిగించే శ్రమ కూడ నిజమైన శ్రమ కలుగజేయలేదని మనము గ్రహించాలి. సాటిలేని శ్రేష్టత కలిగినవి, వాటికంటే ఎంతో ఉన్నతమైనవి మనకొరకు నిశ్చయముగా ఉన్నాయనే ఖచ్చితమైన నిర్ణయంలోకి మనం రావాలి. లేనట్లయితే ఈ లోకపు భయ-దుఃఖములలో కూరుకుపోతాము.

    ఒక్కసారి క్రీస్తు మహిమా దృశ్యము కళ్లార వీక్షించగలిగితే మనకు వీటినండి సంపూర్ణ విడుదల కలుగుతుంది. ఆ మహిమను గూర్చిన జ్ఞానము మనకుంటే, ఆ ఆలోచనలతో మన మనస్సులు నింపబడితే, ఆ మహిమ మనలను ఊరడిస్తున్నట్లయితే, ఇంక ఈ వ్యాధి, బాధలు, దుఃఖము, భయము, అపాయము, మరణము, మొదలగునవి మనలను ఏమైన అననివ్వండి, వాటిని అధిగమించడానికి మనము సిద్ధంగ ఉన్నవారమౌతాము.

    ‘క్రీస్తు మహిమను ధ్యానించడం‘ అనే ఈ మార్గము విశ్వాసుల మనస్సులను హృదయాలను ఈ లోక శ్రమలనుండి పైకెత్తి, సర్వరోగనివారిని వలె వారిలో ఉన్న విషమంతటిని తొలగిస్తుంది. లేనియెడల ఆ విషము వారిని కృంగదీస్తుంది. క్రీస్తు మహిమను ధ్యానించడం ద్వార పరిశుద్ధాత్ముడు మనకు దేవుని ప్రేమను గ్రహింపజేసి మనలను “చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషముతో” ఆనందింపజేస్తాడు.

    ఆయన మహిమను తీక్షణంగ తలపోయడమే అన్ని సమయాల్లో (మరణంలో సహితం) మనలను సంతోషభరితుల్ని చేస్తుంది.

    John Owen (1616 – 1683) is a renowned puritan pastor and theologian. He also worked as Vice-Chancellor at the University of Oxford. He authored many books including Communion with God.

    Popular
    Books
  • John Bunyan (1628 – 1688)
  • యాత్రికుని ప్రయాణం

    ఆత్మీయ పోరాటమును, ప్రయాణమును, జాన్ బణ్యన్ గారు ఈ పుస్తకంలో అద్భుతముగా వివరించారు
    Sermon
  • Joseph Livingston
  • దేవుని లక్ష్యం

    Sermon
  • Paulson Vasala
  • ఆత్మలో మూలుగుచు మహిమ కొరకు నిరీక్షించుచు

    Life Eternal
    Unto God be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.
    Contact Us | +91 9573331717All Rights Reserved.